ఏపీ సర్కార్ పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. శుక్రవారం అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్ అవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరకూ పాదయాత్రలు చూశానన్నారు.
కానీ ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రల్లో చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూనే రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయని.. నాడు కాంగ్రెస్ జగన్ ను జైలుకు పంపడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు.
శనివారం రాష్ట్ర విభజన జరిగిన దుర్దినమన్నారు. కానీ నేటికీ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందలేదన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై ఈ నెల 22న విచారణ జరుగుతుందని వెల్లడించారు. తప్పు జరిగిన విషయాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
టీడీపీ అధికారంలో ఉండగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించలేదు. ఇప్పుడు సీఎం జగన్ ని కలవడానికి ప్రయత్నించినా అవకాశం ఇవ్వడం లేదంటున్నారని చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్.