ఎట్టిపరిస్థితుల్లో.. రష్యా మొదట అణ్వాయుధాన్ని వాడదని.. తమ వద్ద ఉన్న ఆయుధాలతో ఎవర్నీ బెదిరించడం లేదని పుతిన్ వెల్లడించారు. మరీ మేం అంత పిచ్చిగా లేమని, అణ్వాయుధాలపై అవగాహన తమకు ఉందని.. అణ్వాయుధాల గురించి చెప్పుకుంటూ ప్రపంచాన్ని బెదిరించలేమన్నారు.
రష్యా దగ్గర అత్యాధునిక న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇతర దేశాల్లో తమకు చెందిన ఆయుధాలు లేవని, కానీ అమెరికా మాత్రం తమ అణ్వాయుధాల్ని టర్కీలో పెట్టినట్టు పుతిన్ చెప్పారు.
అయితే రష్యా వార్షిక మానవ హక్కుల మండలి సమావేశంలో మాట్లాడిన పుతిన్.. దీంతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు. అణ్వాయుధాలను వాడే రిస్క్ పెరుగుతుందని..తామేమి అణుదాడి చేసేందుకు పిచ్చిగా లేమని, కానీ ఎవరైనా చేస్తే మాత్రం అణ్వాయుధం వాడనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు.
అదే విధంగా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదన్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దాడి ప్రకటించిన తర్వాత పుతిన్ అణ్వాయుధాల్ని వాడుతారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు అలాంటి దాడి ఏమీ జరగలేదు. అయితే అణ్వాయుధాల్ని ప్రయోగించే అవకాశాలు పెరుగుతున్నాయని, ఆ విషయాన్ని దాచి పెట్టడం తప్పే అవుతుందని పుతిన్ అన్నారు.