పాకిస్తాన్ ఇండియాపై రెచ్చగొట్టే చర్యలకు దిగిన పక్షంలో ప్రధాని మోడీ నాయకత్వం కింద భారత్ తన సైనిక సత్తాతో ఆ దేశంపై విరుచుకుపడే అవకాశం ఉందని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఓ నివేదికలో పేర్కొన్నాయి. పాకిస్తాన్ ఇండియాకు వ్యతిరేకంగా మిలిటెంట్ గ్రూపులను చాలాకాలంగా పెంచి పోషిస్తోందని, దీన్ని సహించలేని ఇండియా గతంలో కూడా పాక్ పై మిలిటరీ ఫోర్స్ ను ఉపయోగించిందని ఈ రిపోర్టు గుర్తు చేసింది.
ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు హెచ్చుగానే ఉన్నాయని, కశ్మీర్ లో అశాంతి,లేదా మిలిటెంట్ దాడులు వీటిని మరింత పేట్రేగేలా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా కశ్మీర్ సమస్య, సీమాంతర ఉగ్రవాదం రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. ఈ రెండు దేశాలూ అణ్వస్త్ర దేశాలు కావడం వల్ల పరిస్థితి జటిలం కావచ్చు.. వాస్తవాధీన రేఖ వద్ద కాల్పుల విరమణకు సంబంధించి 2021 లో కుదిరిన ఒడంబడికను పునరుద్ధరించుకోవాలని భారత-పాకిస్తాన్ దేశాలు భావిస్తున్నాయి.. ఆ నేపథ్యంలోనే ఇవి కామ్ గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి అని కూడా ఈ రిపోర్టు అభిప్రాయపడింది.
లడఖ్ సరిహద్దుల్లో సైనిక మోహరింపులు పెరుగుతున్న కారణంగా భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా పెరుగుతున్నాయని, ఇది తమ దేశ ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించవచ్చునని ఈ నివేదిక మరో చాఫ్టర్లో పేర్కొంది, వివాదాస్పద సరిహద్దుల్లో ఈ రెండు దేశాలూ తమ బలగాలను మోహరిస్తున్నాయి.. ఈ పరిస్థితి ముఖ్యంగా అమెరికన్లకు సైతం ప్రమాదకరం కావచ్చు.. అప్పుడు అమెరికా జోక్యం చేసుకోవలసి రావచ్చు అని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
2020 లో గాల్వన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలు ఉభయదేశాల సంబంధాలను దెబ్బ తీశాయని గుర్తు చేశాయి. ఓ వైపు చర్చలంటూనే మరోవైపు భారత్-చైనా ఘర్షణలకు తలపడుతున్నాయని ఈ రిపోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.