పార్లమెంటుకు కొత్తగా ఎన్నికైన ఎంపీల ఆవేదనను అన్ని పార్టీలు అర్థం చేసుకోవాలని ప్రధాని మోడీ కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఆరంభమైన తొలి రోజు బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశాలను ఎలాంటి అవరోధాలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీలు సహకరించాలన్నారు.
వాయిదాలు, రభసలు వంటివి లేకుండా సభాకార్యకలాపాలు అర్థవంతంగా జరిగేందుకు ప్రభుత్వానికి పార్టీల సహకారం ఎంతయినా అవసరమని, ఇందుకు సమిష్టిగా అంతా ముందుకు రావాలన్నారు. తమ ఉజ్వల భవితవ్యానికి ఉపయోగపడేలా యువ సభ్యులు సంబంధిత చర్చల్లో పాల్గొనేందుకు వారికి అవకాశాలు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇటీవల కొందరు ఎంపీలను తాను కలిసినప్పుడు సభలో గందరగోళాల కారణంగా ఎన్నో సార్లు వాయిదాలు పడ్డాయని విచారం వ్యక్తం చేశారని, ఇది దురదృష్టకరమన్నారు. తాము చెప్పదలచుకున్న అంశాలను పార్లమెంట్ దృష్టికి తేలేకపోయామని వారు చెప్పారని, కనీసం ఇప్పుడైనా ఈ శీతాకాల సమావేశాలను హుందాగా నిర్వహిద్దామని మోడీ అన్నారు. . యువ విపక్ష ఎంపీల ఆవేదనను తాను అర్థం చేసుకున్నానన్నారు.
జీ-20 అధ్యక్ష బాధ్యతలను ఇండియా చేబట్టిన ఈ సందర్భంలో ఇది దేశానికంతటికీ గర్వ కారణమని, ప్రపంచం ముందు మనమేమిటో నిరూపించి చూపుదామని మోడీ పేర్కొన్నారు. జీ-20 పై నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో వివిధ పార్టీల నేతలతో సౌహార్ద పూరిత చర్చలు జరిగాయని ఆయన తెలిపారు. పార్లమెంటులో కూడా ఈ ధోరణి ‘ప్రతిబింబించ’ గలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.