“మా తాతలు నేతులు తాగారు..మా మూతులు వాసన చూడండన్నట్టుంది” హుజురాబాద్‌లో టీఆర్ఎస్ నేతల తీరు. విద్యార్థి ఉద్యమ నాయకుడికి హుజురాబాద్ ఉప ఎన్నిక టికెట్ ఇచ్చాం చూడండహో అంటూ వారు దండోరా వేస్తోంటే చాలా మందికి నవ్వొస్తోంది. అదే సమయంలో అనేక ప్రశ్నలనూ తెరమీదకు తెస్తోంది. ఏ పార్టీ అయినా ఓ విద్యార్థి ఉద్యమ నాయకుడికి టికెట్ ఇస్తుందంటే అదో మంచి పరిణామం. బేషరతుగా ఆహ్వానించదగిన విషయం. కానీ గెల్లు శ్రీనివాస్‌ను ఇంకా విద్యార్థి ఉద్యమ నాయకుడు అంటూ గులాబీ నేతలు గొప్పలు చెప్పుకోవడమే చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఏడేళ్లుగా విద్యార్థుల సమస్యలపై గెల్లు శ్రీనివాస్ ఎక్కడెక్కడ, ఏయే పోరాటాలు చేశారో చెప్పాలని విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మొన్నటికి మొన్న సొంత నియోజకవర్గంలోనే ఒక నిరుద్యోగి రైలు కిందపడి బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే.. కనీసం పరామర్శించలేని, వారి కుటుంబానికి భరోసా ఇవ్వకపోవడమేనా విద్యార్థి ఉద్యమ నాయకుడి లక్షణం అని వారు నిలదీస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలపై పోరాటాలు చేశానని అంటున్న గెల్లుకు.. ఏడేళ్లుగా కేసీఆర్‌కు విద్యార్థులు, నిరుద్యోగులకు చేస్తున్న అన్యాయాల్లో ఒక్కటీ కనిపించలేదా అని అడుగుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసి, విసిగిపోయి.. ఏడాది కాలంలోనే 10 మందికిపైగా నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. అప్పుడు ఈ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎక్కడికి పోయారో చెప్పాలని కోరుతున్నారు. తప్పుడు మార్కులు వేసి కేసీఆర్ సర్కార్ తప్పిదం చేసినప్పుడు.. ఉరికొయ్యలకు వేలాడిన ఇంటర్ విద్యార్థులెవరూ గెల్లుకు కనిపించలేదా అని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మించి వంచిస్తే.. డబ్బుల కోసం అదే నిరుద్యోగులు కూలీ పనులకు పోతుంటే కనీసం నోరు ఎందుకు తెరవలేదో చెప్పాలని అంటున్నారు.
అవన్నీ కాకపోయినా కనీసం అట్టడుగు విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ సమయానికి అందక.. కొందరు చదువుకే దూరమై, మరికొందరు జీవితానికే స్వస్తి పలికితే.. గెల్లు ఉద్యమగళం ఎందుకు మూగబోయిందని నిలదీస్తున్నారు. కాలేజీ అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతుంటే, స్కూల్ పిల్లలు నాలాల్లో కొట్టుకుపోతుంటే…. ఎక్కడా కనిపించలేదేం గెల్లు? అని అడుగుతున్నారు. ఎప్పుడో చేసిన పోరాటాలకు.. ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడమేంటని మండిపడుతున్నారు. తమ ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే.. విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఊరేగినా తమకు అభ్యంతరం లేదని లేదంటే తాను ఓ రాజకీయ నిరుద్యోగి అని ఒప్పుకోవాలని హితవు పలుకుతున్నారు.