అగ్నిపథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇప్పటిదాకా ఉత్తరాదిలో జరిగిన ఈ నిరసనలు.. దక్షిణాదికి పాకాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఆందోళనకారులు రైలు బోగీలకు నిప్పు పెట్టారు. స్టేషన్ బయట ఆర్టీసీ బస్సులపై దాడులకు పాల్పడ్డారు.
ఆందోళనకారుల నిరసనలతో సికింద్రాబాద్ ప్రాంగణం అట్టుడికిపోయింది. తెల్లవారుజామునే భారీగా స్టేషన్ దగ్గరకు చేరుకున్న యువకులు.. అగ్నిపథ్ ను రద్దు చేయాలంటూ గళమెత్తారు. సికింద్రాబాద్ నుంచి బయల్దేరే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ కు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా యువకులు ఆందోళనకు దిగడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను వేసి నిప్పుపెట్టారు ఆందోళనకారులు. పార్శిల్ చేసిన వాహనాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడేశారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపారు. లాఠీఛార్జ్ కూడా చేశారు. పలువురికి గాయాలయ్యాయి.