ప్రతిపక్షాల అబద్దాలకు అభివృద్ధి అనే ఆయుధంతో సమాధానం చెబుతున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజక వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
అయితే ప్రతిపక్షాలు ప్రజలకు అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ఆరువేల ఉద్యోగాలు ఇస్తే.. బీఆర్ఎస్ పాలనలో 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు హరీశ్ రావు. తెలంగాణలో నిరుద్యోగం లేదని.. కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలన బాగోలేదు కాబట్టే కేసీఆర్ ను రెండు సార్లు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారన్నారు. మళ్లీ రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని అన్నారు. కేసీఆర్ పాలనను చూసి యావత్ దేశమే గర్విస్తుందన్నారు.
తరువాత ఆయన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్,బీజేపీ నేతలు చేసే విష ప్రచారాలకు, బీఆర్ఎస్ కార్యకర్తలు తెలివితేటలతో బుద్ధి చెప్పాలని సూచించారు. అభివృద్ధి చేసి చూపిస్తున్నాం కాబట్టే అవార్డులు మన సొంతమయ్యాయని అన్నారు.