దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. దీంతో డిసెంబర్‌లో నిరుద్యోగ రేటు ఏకంగా 16 నెలల గరిష్ఠానికి చేరింది. 2022 డిసెంబర్ నెలలో భారత నిరుద్యోగ రేటు 8.3 శాతానికి చేరింది. గత సంవత్సరంన్నరలో ఇదే అత్యధికం. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి గణాంకాలు వెల్లడించాయి. నవంబర్‌లో దేశంలో 8.0 శాతంగా ఉన్న అన్‍ఎంప్లాయిమెంట్ రేటు డిసెంబర్‌లో 0.3 శాతం అధికమై 8.3 శాతానికి చేరిందని సీఎంఐఈ పేర్కొంది. పూర్తి వివరాలు ఇవే.
సీఎంఐఈ ప్రకారం, దేశంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అధికంగా ఉంది. కిందటి నెలలో 8.96 శాతంగా అర్బన్ అన్‍ఎంప్లాయిమెంట్ రేటు డిసెంబర్‌లో 10.09 శాతానికి చేరింది. అంటే ఏకంగా ఒక శాతం కంటే ఎక్కువైంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మెరుగైంది. రూరల్ నిరుద్యోగ రేటు డిసెంబర్‌లో 7.44 శాతంగా ఉంది. ఇది కిందటి నెలలో 7.55 శాతంగా నమోదైంది.
అయితే, దేశంలో నిరుద్యోగ రేటు మరీ అంత అధ్వానంగా లేదని సీఎంఐఈ మేనేజింగ్ డైరెక్టర్ మహేశ్ వ్యాస్ అన్నారు. ఎందుకంటే గత డిసెంబర్ లో 40.48 శాతానికి పెరిగింది.. ఇది 12 నెలల్లో అత్యధికమని చెప్పారు. “ముఖ్యంగా, డిసెంబర్‌లో ఎంప్లాయిమెంట్ రేటు 37.1 శాతానికి పెరిగింది. 2022 జనవరి తర్వాత ఇదే అధికం” అని ఆయన చెప్పారు.
సీఎంఐఈ డేటా ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో కిందటి నెలతో పోలిస్తే డిసెంబర్‌లో నిరుద్యోగ రేటు తగ్గింది. తెలంగాణలో 2022 డిసెంబర్‌లో అన్‍ఎంప్లాయిమెంట్ రేటు 4.1గా ఉంది. నవంబర్‌లో ఇది 6.0గా ఉండేది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‍లోనూ పరిస్థితి మెరుగుపడింది. నవంబర్‌లో 9.1గా నమోదైన అన్‍ఎంప్లాయిమెంట్ రేటు డిసెంబర్‌లో 7.7 శాతానికి దిగి వచ్చింది. అయితే ఇది అక్టోబర్‌లో 5.3 శాతంగానే ఉండేది.
2024 లోక్‍సభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న తరుణంలో గరిష్ఠ నిరుద్యోగ రేటు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‍గా మారాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, జాబ్ మార్కెట్‍లోకి వస్తున్న కోట్లాది మంది యువతకు ఉద్యోగాలను కల్పించడం బీజేపీ సర్కార్‌కు ప్రధాన ఛాలెంజ్‌లుగా ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగాన్నే ప్రతిపక్ష కాంగ్రెస్ ఎక్కువగా ఎత్తిచూపుతోంది. దీన్ని మోడీ ప్రభుత్వ వైఫల్యంగా విమర్శిస్తోంది