రూ.251కే స్మార్ట్ ఫోన్ ఇస్తామని చెప్పి ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన రింగింగ్ బెల్స్ అనే కంపెనీ గుర్తుంది కదా. వారు ఫ్రీడమ్ 251 పేరిట ఫోన్‌ను ఆ రేటుకు అందిస్తామని చెప్పారు. కానీ డబ్బులు వసూలు చేశాక ఇప్పటి వరకు అసలు కనీసం ఒక్కరికైనా ఆ ఫోన్ వచ్చినట్లు ఎక్కడా వార్తలు లేదు. వారు జనాలను మోసం చేశారని మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు కూడా సరిగ్గా అదే తరహాలో ఓ వ్యక్తి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుండడం దుమారం రేపుతోంది.
హితేష్ పటేల్ అలియాస్ నీల్ పటేల్ అనే ఓ వ్యక్తి దాదాపుగా సగం ధరకే ఐఫోన్లను అందిస్తానంటూ నారదపే అనే డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియాలోనూ అతను ప్రచారం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే మార్కెట్‌లో రూ.96,900 ఉన్న ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్ ను రూ.57,449కు ఇస్తానని, అలాగే రూ.1,19,900 ఉన్న ఐఫోన్ 12 ప్రొను రూ.67,449కు అందిస్తానని, రూ.54,900 ఉన్న ఐఫోన్ 11ను రూ.26,949కు ఇస్తానని చెప్పాడు. దీంతో చాలా మంది ఫోన్లను బుక్ చేశారు కూడా. ఇప్పటి వరకు మొత్తం 8వేల ఆర్డర్లు వచ్చాయని అతను తెలిపాడు.
iPhone scam. We know value of this, more than 40 Crore ₹. Not just money, also stole people’s personal photos, SMSes and more. Delivered less than xxx phones. Himself said over 8000 orders placed. pic.twitter.com/ppMKPYJBnv
— Nishant (@nishant_india) February 15, 2021
అయితే అతను చేస్తున్నది స్కామ్ అని, ఇలాంటి మోసాలకు ఎవరూ బలికావద్దని ఇంకొందరు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలు పెట్టారు. పండుగలప్పుడు సహజంగానే కొంత తక్కువకు ఫోన్లను అందిస్తారని, కానీ అతను మాత్రం అంత భారీ డిస్కౌంట్ ను అందిస్తానని చెబుతున్నాడంటే అందులో ఏదో మోసం ఉందని గ్రహించాలని కొందరు కామెంట్లు చేశారు. అయితే దీనికి నీల్ పటేల్ సమాధానం ఇచ్చాడు.
యాపిల్ సైట్‌లో ఫోన్లను ఆర్డర్ చేస్తే 2 నుంచి 4 వారాల సమయం డెలివరీకి పడుతుందని, తాను కూడా అంతే సమయంలో ఫోన్లను డెలివరీ చేస్తానని తెలిపాడు. కనుక అప్పటి వరకు వినియోగదారులు ఓపిక పట్టాలని, తాను మధ్యలో వెళ్లిపోయే రకం కాదని, చివరి వరకు ఉంటానని, వినియోగదారులకు తెలిపిన రేట్లకు ఐఫోన్లను ఇస్తానని అన్నాడు. అలాగే తాను ప్రచారానికి ఖర్చు చేయడం లేదని, కనుకనే అంత భారీ మొత్తంలో డిస్కౌంట్లకు ఐఫోన్లను అందిస్తున్నానని తెలిపాడు.
అయినప్పటికీ 5 నుంచి 10 శాతం వరకు సహజంగానే ఎవరైనా డిస్కౌంట్ ఇస్తారు. కానీ అంత మొత్తంలో డిస్కౌంట్ అంటే వినియోగదారులు ఒక్కసారి ఆ ఫోన్లను కొనేముందు ఆలోచించాలని, మోసపోవద్దని పలువురు హెచ్చరించారు. అయితే నిజానికి మన దేశంలో ఇంత భారీ డిస్కౌంట్లకు ఉత్పత్తులను అందివ్వకూడదు. గతంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలే తమ సైట్లలో మరీ భారీ రాయితీలను అందిస్తున్నాయని చెప్పి కోర్టులు అక్షింతలు వేశాయి. ఆ పద్ధతి సరికాదని చెప్పాయి. ఈ క్రమంలో నీల్ పటేల్ అనే వ్యక్తి సరిగ్గా అదే కోవలో భారీ మొత్తంలో డిస్కౌంట్లకు ఐఫోన్లను అందిస్తానని చెబుతుండడం కూడా కోర్టు చెప్పిన ప్రకారం సరికాదు. మరిదీనిపై ఎవరైనా కేసు పెడతారా, చివరకు ఏమవుతుంది ? అనే వివరాలు తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు. అయితే ఎవరైనా సరే ఇలాంటి ఆఫర్లకు ఆకర్షితులు కాకూడదు. అంత భారీ మొత్తంలో డిస్కౌంట్ ఇస్తామంటే కచ్చితంగా మోసం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. లేదంటే మోసపోయాక బాధపడీ ప్రయోజనం ఉండదు.