ఢిల్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ సంచలన డిమాండ్ ను లోక్ సభ ముందు ఉంచారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్ దీప్ దన్ ఖర్ ను తప్పించాలంటూ నినదించారు. అయితే.. ఎంపీకి ఊహించని రీతిలో సమాధానం వచ్చింది. పార్లమెంట్ బడ్జెట్ రోజున జరిగిన ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించిన తర్వాత ప్రధాని ప్రతిపక్ష సభ్యులు ఆసీనులైన బెంచీల వైపు వెళ్లి అందరినీ పలకరించారు. ఆ సమయంలో తృణమూల్ ఎంపీ సౌగతారాయ్ స్పందిస్తూ.. దయచేసి బెంగాల్ గవర్నర్ ను తప్పించండి అంటూ వేడుకున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగుజేస్తున్నారని ప్రధానిని కోరారు.
దీనికి ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తూ.. ముందు మీరు రిటైర్ అయితే ఆ తర్వాత దాన్ని పరిశీలిస్తాం అని బదులిచ్చారు. ప్రధాని మాటల్లోని మర్మం అర్థం కాక ఆయన అయోమయానికి గురయ్యారు సౌగతారాయ్.
దీనిపై సౌగతారాయ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. నిజంగా నన్ను రాజీనామా చేయాలని ఆయన కోరుకుంటున్నారా..? ఆ తర్వాత నా అభ్యర్థనను పరిశీలిస్తారా..? లేక నేను రాజీనామా చేస్తే గవర్నర్ చేయాలనుకుంటున్నారా..? అన్నది నాకు తెలియదు అని వివరించారు. అయితే గవర్నర్ ను తప్పించాలన్న డిమాండ్ ను మరోసారి వినిపిస్తానన్నారు ఎంపీ.