ఢిల్లీ లిక్కర్ స్కాం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్టు ఇచ్చారు. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ క్రమంలో ఈడీకి రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు పంపించింది. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీనని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తరఫున తాను పని చేశానని పిళ్లై ఒప్పుకున్నట్టు ఈడీ పేర్కొంది. ఈ మేరకు పిళ్లై స్టేట్ మెంట్ ను రికార్డు చేసి రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది.
రేపు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించబోతోంది. పిళ్లై ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆమెను ఈడీ ప్రశ్నించనుంది. అలాంటి సమయంలో తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలంటూ పిటిషన్ దాఖలు చేసి పిళ్లై షాక్ ఇచ్చారు.
ఈ కేసులో డబ్బు బదిలీలకు సంబంధించి ఈడీ డిజిటల్ ఆధారాలు సేకరించింది. సెల్ ఫోన్ తో పాటు పలు కీలక ఆధారాలను ఈడీ ఇప్పటికే రెడీ పెట్టుకుంది. రేపు పిళ్లై సమక్షంలోనే ఆమెను ఈడీ విచారించనున్నట్టు సమాచారం. పిళ్లై పిటిషన్, కవిత విచారణ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయనేది ఆసక్తి కలిగిస్తోంది.