దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని అసోం ముఖ్య మంత్రి హిమాంత బిస్వశర్మ అన్నారు. తన భర్త ముగ్గురు భార్యలను కలిగిఉండాలని ఏ ముస్లిం మహిళా కోరుకోవడం లేదన్నారు.
ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌర స్మృతి( యూనిఫామ్ సివిల్ కోడ్)ను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఇటీవల ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. సీఎం పుష్కర్ సింగ్ ను ఆయన ఢిల్లీలో ఆదివారం కలిశారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..
తనను కలిసిన ముస్లింలందరూ ఉమ్మడి పౌరస్మృతి కావాలని కోరినట్టు తెలిపారు. తన భర్తకు ముగ్గురు భార్యలు ఉండాలని ఏ ముస్లిం మహిళా కోరుకోదన్నారు. కావాలంటే మీరు ఏ ముస్లిం స్త్రీ నైనా అడగవచ్చన్నారు.
ముస్లిం పురుషుడు ముగ్గురు మహిళలను వివాహం చేసుకోవడం తనకేమీ సమస్య కాదనీ, అది ముస్లిం తల్లుల, సోదరీమణుల సమస్య అని తెలిపారు. ముస్లిం మహిళలు, తల్లులకు సమాజంలో గౌరవం రావాలంటే ట్రిపుల్ తలాక్ చట్టం తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్నారు.