ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తేనే దేశాభివృద్ధని చెప్పారు ప్రధాని మోడీ. బీజేపీ నేతలు, కార్యకర్తలతో ఆయన వర్చువల్ గా మాట్లాడారు. అన్ని రాష్ట్రాలకు చెందిన నాయకులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ రాజకీయాలకు అతీతంగా అందరి మన్ననలు పొందిందని చెప్పారు. ఆత్మనిర్భర్ పునాదులతో నవభారత్ నిర్మాణానికి ఇది దోహదపడుతుందని చెప్పారు.
పేదలు, మధ్యతరగతి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంపైనే కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిననట్లు వివరించారు మోడీ. ఆర్థిక స్వావలంబనతో పాటు దేశాభివృద్ధికి బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
గత ఏడేళ్లలో తాము తీసుకున్న నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతూ వచ్చిందన్నారు ప్రధాని. అంతకుముందు లక్షా 10వేల కోట్లుగా ఉన్న జీడీపీ.. ప్రస్తుతం 2లక్షల 30వేల కోట్లు దాటిందని తెలియజేశారు. వ్యవసాయరంగాన్ని ఆధునీకరించేందుకు బడ్జెట్ లో ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు మోడీ. ప్రభుత్వ చర్యల ఫలితంగా దేశ ఎగుమతులు 4.7 లక్షల కోట్లుకు చేరాయని వివరించారు.
సరిహద్దు గ్రామాల నుంచి వలసలు దేశ భద్రతకు మంచిది కాదని.. అందుకే ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు మోడీ. కరోనా తర్వత ప్రపంచ స్థితిగతులు మారిపోయాయని చెప్పారు. భారత్ ను మరింత పటిష్టంగా చూడాలని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయన్నారు ప్రధాని.