దేశ ఆర్థిక వృద్ధిలో కీలకమైన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ రోజు ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ప్రశంసించారు.
ఈ బడ్జెట్‌లో పన్ను తగ్గింపులను ప్రభుత్వం ప్రకటించడం స్వాగతించదగిన చర్యగా ఆయన పేర్కొన్నారు. తాను తక్కువ పన్ను విధానాన్ని నమ్ముతానని తెలిపారు. కావున, ఏదైనా పన్ను తగ్గింపు చర్యలను స్వాగతించవచ్చని అన్నారు. ఎందుకంటే ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు ఇవ్వడం అనేది ఆర్థిక వ్యవస్థను బలపర్చడానికి ఉత్తమమైన మార్గమని వెల్లడించారు.
మరోవైపు కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. దేశంలోని సాధారణ ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలతో పాటు తీవ్రమైన ఆర్థిక పరిస్థితులను కేంద్రం పరిష్కరించడం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ అన్యాయం చేసిందన్నారు.
దేశంలో ప్రజలు తీవ్ర దుస్థితిలో ఉన్నారని ఆయన వెల్లడించారు. ధరల పెరుగుదలతో పాటు నిరుద్యోగంతో సహా ప్రస్తుత ఆర్థిక సమస్యలను ఈ బడ్జెట్‌లో పరిష్కరిస్తున్నారా లేదా అన్నదే అసలైన సమస్య అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఆదాయం లేనప్పుడు మినహాయింపులతో ఎలా ప్రయోజనం వుంటుందన్నారు.