తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. లోక్ సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. గడిచిన ఆరేళ్లలో తెలంగాణకు పన్నుల వాటా కింద రూ. 85,013 కోట్లు,రాష్ట్రాల విపత్తు కింద రూ.1289.04 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ప్రభుత్వ సహాయం కింద రూ.1.916 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద రూ.6,511 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 51,298.84 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు విడుదల చేసినట్లు రాత పూర్వకంగా తెలిపారు. అయితే 2014-15 సంవత్సరంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆ తర్వాత క్రమంగా అప్పుల పాలైనట్టు లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్నారు.