ఆర్థిక వ్యవస్థపై జోకులు వేయడం మానుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి చురకలంటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఆయన ఈ అంశంపై మాట్లాడొద్దని మండిపడ్డారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నోవోటెల్ లో కేంద్ర బడ్జెట్ పై దూరదర్శన్ ఏర్పాటు చేసిన.. కాక్లేవ్ లో నిర్మలా పాల్గొన్నారు. నెంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని మాట్లాడాలని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉపాధిహామీకి కేటాయించిన మొత్తం కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 2014లో తెలంగాణకు 60వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు 3 లక్షల కోట్లు ఎలా అయ్యిందని ఆమె ప్రశ్నించారు. 2014 నుండి ఇప్పటివరకు కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి లక్షా 39వేల కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చాయని వివరించారు.
తెలంగాణలో మెడికల్ కాలేజీల కోసం ప్రతిపాదనలు పంపమంటే పంపలేదని, మళ్లీ ఇప్పుడు విమర్శించడం సరికాదన్నారు. మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్ పేర్లనే కేంద్రానికి పంపించారని.. అందుకే వాటిని తిరస్కరించామని చెప్పారు. తెలంగాణలో ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా కేసీఆర్ కి తెలియదని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి సరైన డేటా ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు నో డేటా అవైలబుల్ అని ఎవరికి వర్తిస్తుందో ఆలోచించుకోమన్నారు. 2014 నుండి ఇప్పటివరకు 157 మెడికల్ కాలేజీలు స్థాపించామని.. వాటి వద్దనే నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఆమె వివరించారు నిర్మలా సీతారామన్.