దేశ వ్యాప్తంగా గడిచిన ఐదేండ్లలో 655 ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2017 నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎన్ కౌంటర్లు జరిగాయన్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ప్రశ్నకు బదులుగా కేంద్రం వివరాలు వెల్లడించింది. ఈ మేరకు పార్లమెంట్ లో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బదులిచ్చారు.
గడిచిన ఐదేండ్లలో దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 117 ఎన్ కౌంటర్లు జరిగాయని ఆయన వెల్లడించారు. అసోం(50)లతో రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఆ తర్వాత స్థానాల్లో జార్ఖండ్ (49), ఒడిశా (36), జమ్ము కశ్మీర్ (35), మహారాష్ట్ర (26), బిహార్ (22), హర్యానా (15 ) తమిళనాడు (14) ఉన్నాయని వివరించారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్ లో 9 ఎన్ కౌంటర్లు చోటు చేసుకున్నట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ , అరుణాచల్ ప్రదేశ్ లల్లో 9 ఎన్ కౌంటర్లు, మేఘాలయా (9) , రాజస్థాన్, ఢిల్లీలో8 చొప్పున ఉన్నాయన్నారు.
“ఎన్‌కౌంటర్ హత్యలు” ఆరోపణలపై పోలీసు అధికారులపై కొనసాగుతున్న విచారణలు, అలాంటి కేసుల్లో దోషులుగా తేలిన అధికారుల సంఖ్యపై వివరాలు తెలపాలని గాంధీ అడిగారు. దీనిపై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి … పోలీసులు, శాంతి భద్రతలు రాష్ట్ర అంశాలని అందువల్ల తాము అలాంటి రికార్డులేవి నిర్వహించట్లేదని తెలిపారు.