గత ఎంపీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓటమికి, ఎంపీ డీఎస్ కొడుకు అరవింద్ గెలుపు ఉన్న హమీల్లో నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కీలకమైంది. అరవింద్ అయితే ఏకంగా 100రోజుల్లో పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు. అప్పట్లో అదో సంచలనం కావటంతో పాటు పసుపు రైతులు ఎక్కువగా ఉండే నిజామాబాద్ జిల్లాపై కాషాయ జెండా ఎగురవేసింది.
కానీ ఇటీవలి మున్సిపల్ ఎన్నికల వరకు కూడా పసుపు బోర్డు రాలేదని, ఎంపీ అరవింద్ తప్పుడు వాగ్ధానం చేశారంటూ టీఆర్ఎస్ విరుచకపడింది. నిజామాబాద్ రైతులను మోసం చేశారంటూ అరవింద్‌ను టార్గెట్ చేసింది. దీంతో ఎంపీ అరవింద్ డిఫెన్స్‌లో పడ్డట్లు కనపడ్డారు.
అనూహ్యంగా కేంద్రం పసుపు బోర్డు అంశంపై స్పందించింది. డివిజనల్ ఆఫీసుగా ఉన్న పసుపు బోర్డు ఆఫీసునే రీజినల్ స్థాయికి మార్చటంతో పాటు పసుపు బోర్డుకు ఉండే అన్ని అధికారాలను ఇస్తూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ఉత్తర్వులను ఎంపీ అరవింద్‌కు అందజేశారు.
Advertisements
ఆ లేఖలో… నిజామాబాద్‌లో ఉన్న డివిజనల్ ఆఫీసును రీజినల్ ఆఫీసుగా మారుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పసుపుతో పాటు ఇతర సుగంధ ద్రవ్యాలకు సంబంధించి… రాష్ట్ర ప్రభుత్వం, రైతులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, రైతులకు మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతు సంఘాలు, పసుపు సహా మిర్చి కొనుగోలు వ్యాపారులతో ముఖాముఖి చర్చలు కూడా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టేలా ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఎంపీ అరవింద్ వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తూ… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అంటూ సంబురాలు చేసుకుంటున్నారు.