దేశంలో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా దేశంలో కరోనా మరోమారు విజృంభిస్తోంది. ఇటీవల రోజు వారీ కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా కేరళ, ఢిల్లీ, కర్ణాటకలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
దీంతో కరోనాపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కరోనా పరిస్థితిపై ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కరోనా వ్యాప్తి నియంత్రణకు అవలంబించాల్సిన పద్ధతులపై ఐదంచెల వ్యూహాన్ని అనుసరించాలని, తద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలని సూచనలు చేసింది.
తాజాగా దేశంలో గురువారం 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది బుధవారం కేసు సంఖ్య (5,233)తో పోలిస్తే 40 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32,498కు పెరిగిందని పేర్కొంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 8 మంది మరణించినట్లు తెలిపింది.
దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,31,97,522కు చేరుకున్నట్టు పేర్కొంది. వారిలో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు చెప్పింది. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 5,24,723 మంది మరణించినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.