కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కాసేపట్లో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 8 గంటల 25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. ఎన్ఐఎస్ఏలో రాత్రికి బస చేయనున్నారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం తెలంగాణ బీజేపీ నేతలతో కూడా అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఆదివారం ఉదయం సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్ లో అమిత్ షా పాల్గొననున్నారు. ఆ అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం నేరుగా ప్రత్యేక విమానంలో కేరళలోని కొచ్చికి వెళ్లనున్నారు. సీఐఎస్ఎఫ్ 54వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్ పేట మండలం హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమీలో ఈ నెల 12న ఉదయం నిర్వహించే కార్యక్రమంలో బలగాలు వివిధ ప్రదర్శనలు చేయనున్నాయని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.