ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సామాజికి గుర్తింపు, భాష, రాజకీయ హక్కుల జోలికి వెళ్లమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం వాటిని పరిరక్షిస్తుందని చెప్పారు. పౌరసత్వం సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన వెంటనే ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు ఎగిసిపడిన నేపధ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన అమిత్ షా పౌరసత్వం చట్టం రాగానే కాంగ్రెస్ కు కడుపునొప్పి మొదలయ్యిందని..అందుకే ఆ పార్టీ ”ఢిల్లీలో భారత్ బచావో” ర్యాలీ నిర్వహిస్తుందని విమర్శించారు.
పౌరసత్వం చట్టంపై బీజేపీ పాలిత రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయాలో హింసాత్మక నిరసన కొనసాగుతోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి శరణార్దులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడాన్ని ఈ రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గువహటిలో విధించిన కర్ఫ్యూను సడలించారు. అయితే నాగాలాండ్ లో ఉద్రిక్తత కొనసాగూనే ఉంది. నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆరు గంటల ఆందోళనకు పిలుపునివ్వడంతో స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు మూసివేశారు.