న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు హిందీ షాక్ తగిలింది. విమర్శల హోరు అధికం కావడంతో గొంతు సవరించక తప్పలేదు. ప్రాంతీయ భాషలపై హిందీని రుద్దాలని ఎప్పుడూ అనుకోలేదని అమిత్ షా స్పష్టం చేశారు. తాను హిందీయేతర రాష్ట్రమైన గుజరాత్ నుంచి వచ్చానని, మాతృభాష ఫస్ట్ ప్రయారిటీ అని తేల్చి చెప్పారు. ఆ తర్వాత రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని మాత్రమే తాను కోరానని వివరణ ఇచ్చుకున్నారు.
ఇప్పటికే ప్రముఖ హీరో రజనీకాంత్ మన దేశంలో ఉమ్మడి భాష కుదరదని, హిందీని బలవంతంగా రుద్దవద్దని సూచించారు. రాజ్యాంగ హామీకి షా, సుల్తాన్, సామ్రాట్ ఎవరైనా విఘాతం కలిగించలేరని హీరో, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్ హెచ్చరించారు. ఉమ్మడి భాషగా హిందీ ఉండాలని షా అనడం దేశ సమాఖ్య నిర్మాణానికి వ్యతిరేకమని కాంగ్రెస్ నేత వీరప్ప మొయిలీ అభ్యంతరం తెలిపారు. హిందీ భాష ఒక్కటే దేశాన్ని ఐక్యం చేస్తుందనే భావన ప్రమాదకరమని కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం అన్నారు. ఆరెస్సెస్ అజెండా అమలు కోసం ప్రజలపై హిందీని రుద్దితే దేశం ముక్కచెక్కలయ్యేందుకు బీజం పడ్డట్లేనని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి హెచ్చరించారు. అమిత్ షా వివరణను తమ విజయంగా అభివర్ణించిన డీఎంకే ఈ అంశంపై రాష్ట్రంలో తలపెట్టిన ఆందోళనను విరమించుకుంది.