కేంద్రమంత్రి అశ్వినీ చౌబే కంట తడి పెట్టారు. తన సహచర నేత మరణాన్ని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో మీడియా ముందు కన్నీటి పర్యంతం అయ్యారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పరశురామ్ చతుర్వేది సోమవారం మరణించారు.
ఈ విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. గత మూడు రోజులుగా రైతులకు మద్దతుగా చలిలో తనతో పాటు తమ్ముడు చతుర్వేది కూడా నిరాహార దీక్ష చేశారని చెప్పారు. అలాంటి తమ్ముడు గుండె పోటుతో మరణించారంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.
అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. బక్సర్‌లో 24 గంటల్లో తనపై రెండుసార్లు దాడికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. బక్సర్ లో రైతుల సమస్యలపై జరిగిన కార్యక్రమంలో కొందరు గుండాలు తనపై కర్రలతో దాడి యత్నించారన్నారు.
ఆ గుండాలను తన సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకుందని పేర్కొన్నారు. సెక్యూరిటీ లేకుంటే తన పరిస్థితి ఏమయ్యేదోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నితీశ్ సర్కార్ పై ఆయన ఆరోపణలు చేశారు.