విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాజ్యసభ లో కేంద్ర ఉక్కుశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిజాలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే నిర్ణయం జరిగిందని వెల్లడించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లో ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఒప్పందం తర్వాత సీఎం జగన్‌ను పోస్కో ప్రతినిధులు కలిశారన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిందని, పోస్కో, ఆర్‌ఐఎన్‌ఎల్ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం కుదిరిందన్నారు. పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయగా… కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.