జగన్‌కు అసలు పరీక్ష ‘అపెక్స్’ - union minister gajendra singh shekawath letter to telugu state cm s over apex consel meeting- Tolivelugu

జగన్‌కు అసలు పరీక్ష ‘అపెక్స్’

కేసీఆర్ ట్రాప్‌లో పడితే ఏపీకి నష్టమే..

మీటింగ్ అవసరం లేదని చెబితే మంచి అవకాశాన్ని కాలదన్నుకున్నట్టే..

కేంద్రంతో కయ్యం అవసరమా..?

పోలవరం వ్యాజ్యం సంగతేంటి..?

ఎగువ ప్రాజెక్టులు కట్టుకుంటూపోతున్నా మౌనమేనా?

రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసికట్టుగా వుంటూ కేంద్రంతో పోరాడాలన్న కేసీఆర్ ఆలోచనల వెనుక మాస్టర్ ప్లాన్ ఏదైనా వుందా? రాజకీయానుభవం అంతగా లేని జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి ట్రాప్‌లో పడిపోతూ రాష్ట్రానికి తీరని నష్టం కలిగిస్తున్నారా? కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేయబోయే నదీజలాల వివాద పరిష్కారాల వేదిక ‘అపెక్స్ కౌన్సిల్’ సమావేశానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ వెళ్లాలని అనుకోవడం లేదా? ఒకవేళ వెళ్లకపోతే ఏపీకి జరిగే నష్టం ఏమిటి..?

union minister gajendra singh shekawath letter to telugu state cm s over apex consel meeting, జగన్‌కు అసలు పరీక్ష ‘అపెక్స్’

ఉమ్మడిగా కేంద్రంపై పోరాడాలని ఏపీ సీయంతో కలిసి కేసీఆర్ చేస్తున్న ఆలోచనలను అర్ధం చేసుకోవడం అంత తేలిక కాదు. రాజకీయాలలో ఘనాపాఠిగా వున్న కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనుక వున్న వ్యూహాల్ని పసిగట్టడం రాజకీయ రంగంలో హేమాహేమీలుగా వున్న వారికే సాధ్యం కాదు. రెండు రాష్ట్రాలూ కలిసిమెలిసి వుంటూ కేంద్రాన్ని ఢీకొందామనే కేసీఆర్ వైఖరిని ఒకవేళ జగన్ కూడా అనుసరించాలనుకుంటే రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయని వైసీపీ శ్రేణులు ఆందోళనతో వున్నాయి. ఈ ధోరణి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏమాత్రం అభిలషణీయమైనది కాదని జలవనరుల రంగ పెద్దలు అంచనా వేస్తున్నారు.

తాజాగా కేంద్ర జలశక్తి శాఖకు కేసీఆర్ పంపించిన ఒక లేఖ ఇప్పుడు అనేక సందేహాల్ని లేవనెత్తుతోంది. ఆర్టీసీ సమ్మె, మెఘా కృష్ణారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు, రవిప్రకాశ్ అరెస్టు వంటి వివాదాలతో అతి ముఖ్యమైన, కీలకమైన ఈ అంశం మరుగునపడింది. కానీ, ఈ లేఖకు వున్న ప్రాధాన్యాన్ని రెండు రాష్ట్రాల మధ్య ఇంకా పరిష్కారం కాని వివాదాలపై ఫోకస్ పెట్టిన కొంతమంది పరిశీలకులు గ్రహించారు. వాస్తవానికి ఈ లేఖ ఏపీకి దక్కాల్సిన ప్రయోజనాలను దక్కకుండా చేసేందుకు పన్నిన పన్నాగంగా చెబుతున్నారు. ఈ లేఖ కేంద్రంతో రెండు తెలుగు రాష్ట్రాల వైఖరి ఎలా వుండబోతోందన్నది సూచనప్రాయంగా తెలియజేస్తోంది. అంతేకాదు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎత్తుగడలో ఏపీ సీయం తెలిసో తెలియకో భాగం అవుతూ రాష్ట్ర్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.

అత్యంత వివాదాస్పదంగా మారబోతున్న కేసీఆర్ లేఖ వెనుక ఎటువంటి ఎత్తుగడ ఉంది..? దాని వల్ల ఏపీకి జరిగే నష్టం ఏమిటి..? దీనిపై ఇప్పుడిప్పుడే చర్చ మొదలవుతోంది. మీడియా మొత్తం దాదాపు కేసీఆర్‌కు అనుకూలం కనుక ఈ అంశాన్ని టెలివిజన్ న్యూస్ ఛానల్స్ అనివార్యంగా పక్కనపెట్టవచ్చు. ఇంతకీ అసలు ఈ లేఖలో ఏముంది?

జల వివాదాలపై ఏర్పాటుచేసిన అపెక్స్ కౌన్సిల్ రెండవ సమావేశానికి ముందస్తుగా అజెండా పంపించాలన్న  కేంద్ర జలశక్తి లేఖకు తాజాగా కేసీఆర్ ప్రత్యుత్తరం ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి సమస్యలూ లేవని, అందువల్ల చర్చించాల్సిన ఎజెండా అంశాలు అసలే లేవని కేంద్ర మంత్రికి లేఖ పంపారు. రెండు రాష్ట్రాలూ ఇంత సఖ్యంగా వుండానుకుంటుంటే ఇందులో వివాదం ఏముందని అందరూ అనుకోవచ్చు. కానీ, ఇక్కడే అసలు మేటర్ వుంది. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు అసలు పరిష్కారం అయ్యిందెప్పుడు..? కలిసి కూర్చుని మాట్లాడుకునేదెప్పుడు..?

ఇప్పటికి అనేక పర్యాయాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ అన్ని భేటీల్లోనూ అతి ముఖ్యమైన ఒక అంశం ఎప్పుడూ చర్చకు రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి ఈ అంశాన్ని కన్వీనియెంటుగా మరచిపోయారో, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా దీన్ని పక్కనపెట్టేశారో తెలియదు కానీ, పోలవరం ప్రాజెక్టుపై గతంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన కోర్టు వ్యాజ్యాల గురించి ఎవరూ ప్రస్తావించనే లేదు. దీని గురించి ఉభయ ముఖ్యమంత్రులు కానీ, ఉభయ రాష్ట్రాల అధికారులు కానీ మాట్లాడేవారే లేరు. జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణ దశలో వున్న పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే పొరుగు రాష్ట్రం వేసిన కోర్టు వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలి. వివాదం కోర్టులో వున్నంత వరకు పోలవరం ప్రాజెక్టు పరిపూర్తికి అది గుదిబండే అవుతుంది.

అసలే ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ, రివర్స్ టెండరింగ్‌లో టెండర్ దక్కించుకున్న నిర్మాణ సంస్థ మెఘా సంస్థపై ఐటీ దాడులు జరగడం వంటి పరిణామాలతో అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు పరిపూర్తి అవుతుందో తెలియని అగమ్య గోచర పరిస్థితి వుంది. ఇప్పుడు కోర్టు వ్యాజ్యం కూడా తేలకపోతే, అది మరింత వివాదాస్పదం అవుతుంది. నిజానికి ఇది అంత పెద్ద విషయమే కాదు. కోర్టులో వ్యాజ్యం వేసింది కూడా కేసీఆర్ సంబంధీకులే. వారు తలచుకుంటే ఈపాటికే కోర్టు వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునే వాళ్లు. ఏపీ ముఖ్యమంత్రి కూడా ఈ అంశాన్ని ముందుగానే అడగాల్సి వుంది. రెండు రాష్ట్రాలు సఖ్యతతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు కోర్టుకెక్కిన వివాదాల్ని పరిష్కరించుకోవాలి కదా.. జగన్ దానిపై ఎందుకో ఫోకస్ పెట్టినట్టు లేదు. అది అతని దృష్టిపథంలో లేదని అనుకోవడానికి అదేమంతా చిన్న విషయం కూడా కాదు.

ఇలావుంటే, కేంద్రం ఏర్పాటు చేస్తున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అసలు జగన్ వెళ్లాలనుకుంటున్నారా.. లేదా..? కేసీఆర్ మాదిరి ఈ మీటింగ్ అవసరమే లేదనుకుంటున్నారా? జగన్ కూడా కేసీఆర్ రాసినట్టే కేంద్రానికి మీ మీటింగుకో దండం.. అంటూ లెటర్ రాయబోతున్నారా? మధ్యలో మీ పెద్దన్న పాత్ర ఏంటి..? అవసరం లేదూ అని తెగేసి చెప్పబోతున్నారా..? అలా అయితే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వినట్టే కదా..? ఒకవేళ కేంద్రంతో పోరాటం ఎందుకు అనుకుంటే మరి మీటింగ్‌కు వెళ్లాలనుకుంటున్నారా?  ఈ మీటింగ్‌ అవసరమే లేదని ఓపక్క కేసీఆర్ ఇప్పటికే లేఖ రాసేసినందున జగన్ ఏం చేయబోతున్నారు.? కేసీఆర్ రాకుండా ఒక్కరే ఏపీ తరుఫున అపెక్స్ మీటింగ్‌కు వెళ్లి కేంద్రంతో నేను సయోధ్యగానే వుంటాననే సంకేతాన్ని అందిస్తారా? అలా అయితే కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టే కదా..? రెండు రాష్ట్రాలూ కలిసి రెండు వేర్వేరు రాష్ట్రాల భూభాగాలలో రెండు ముఖ్య నదులు అనుసంధానానికి పూనుకుంటున్న వేళ.. ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పుల్ల పెట్టబోతోందా.? ఈ సందేహాలు అధికార వర్గాల్లో, ఇటు జన సామాన్యంలో మెదళ్లను తొలిచేస్తున్నాయి.

ఒకరకంగా ఈ అపెక్స్ మీటింగ్ జగన్‌కు పెద్ద విషమ పరీక్ష లాంటిది. మీటింగ్‌కు వెళ్లకపోతే కేంద్రంతో తలనొప్పి. ఇప్పటికే రివర్స్ టెండరింగ్‌ వద్దని చెప్పినా వినకుండా మొండిగా వ్యవహరించి పంతం నెరవేర్చుకున్నందుకు కేంద్రం కన్నెర్ర చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసేందుకు రెండు పర్యాయాలు జగన్ అప్పాయింట్‌మెంట్ కోరినా ఇచ్చేందుకు నో అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జగన్ పాలిట కొత్త తలనొప్పిగా తయారైంది.

ఈ సమావేశంలో ఏపీ తరుఫున జగన్‌ పాల్గొనడం అనివార్యం. ఒకవేళ పాల్గొనాలనుకుంటే జగన్ వైఖరి ఏంటో తెలుసుకునేందుకు రాష్ట్ర జల వనరుల శాఖ ఇందుకు సంబంధించిన ఒక నోట్‌ను ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపిందని సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై ఏంచేయాలో అర్ధంగాక సీయం దీన్ని ఇంకా పరిశీలనలోనే వుంచారు.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ చేసిన సూచనలు, సలహాల మేరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాలపై తలెత్తే వివాదాల పరిష్కారంలో కేంద్రం ప్రమేయం అక్కర్లేదని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి కూర్చుని జల వివాదాలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నాయి. కేంద్ర జలశక్తి శాఖ పెద్దన్న పాత్ర పోషించే ఈ అపెక్స్‌ కౌన్సిల్‌ అసలు తమకు అవసరమే లేదని కేసీఆర్ తను రాసిన లేఖలో స్పష్టంచేసినట్టు చెబుతున్నారు. పరస్పర సంప్రదింపులతో రెండు రాష్ట్రాలే జల వివాదాల్ని పరిష్కరించుకోవడం మంచిదన్న అభిప్రాయం జగన్-కేసీఆర్ భేటీల్లో వ్యక్తమయ్యింది. కేంద్రానికి పెద్దన్న పాత్ర ఇవ్వడం ఎందుకన్న ఆలోచనలో కేసీఆర్ వుంటే, దీనిపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఇప్పుడు జగన్ వున్నాడు.

అసలు ఈ అపెక్స్ కౌన్సిల్ ఏమిటనేది ఇప్పటికీ చాలామందికి తెలియదు. రాష్ట్ర విభజన తరువాత విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే నీటి వివాదాన్ని పరిష్కరించే బాధ్యత కేంద్ర జలశక్తి శాఖకు దఖలుపరచారు. దీనికోసం కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటయ్యింది. దీన్ని కేంద్రం నియమించింది. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో నీటి పంపకాలపై తలెత్తిన వివాదాల్ని పరిష్కరించుకునేందుకు 2016 సెప్టెంబరు 23న అప్పటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆనాడు సీయంలుగా వున్న చంద్రబాబు, కేసీఆర్ ఈ అపెక్స్‌ కౌన్సిల్‌ తొలి సమావేశంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల జల వనరుల మంత్రులుగా వున్న దేవినేని ఉమామహేశ్వరరావు, టి.హరీశ్‌రావు కూడా ఆనాటి సమావేశంలో పాల్గొన్నారు.

union minister gajendra singh shekawath letter to telugu state cm s over apex consel meeting, జగన్‌కు అసలు పరీక్ష ‘అపెక్స్’

మళ్లీ ఇన్నాళ్ల తరువాత రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దీనిపై కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. భేటీకి హాజరయ్యే ముందు  తమ తమ ఎజెండాలను స్పష్టం చేయాలని జలశక్తి మంత్రి స్వయంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లకు లేఖలు రాశారు.

గతంలో ఇద్దరు సీఎంలు సమావేశమైనప్పుడు జల వివాదాలను రెండు రాష్ట్రాలూ సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవాలని.. ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాలు, కేంద్రాన్ని ఆశ్రయించకూడదని తెలంగాణ సీఎం ప్రతిపాదించారు. పోలవరం ప్రాజెక్టుపై తలెత్తిన వివాదాన్ని కూడా మనమే పరిష్కరించుకుందామని ఒక భేటీలో సూచించారు. నీటి పంపకాలపైనా పరస్పర అవగాహనతో ముందుకెళ్దామని ఇద్దరూ కలిసి బాసలు చేసుకున్నారు.

ఇలావుంటే, ఇద్దరు సీయంల ఐక్యరాగం- బృందగానం నేపథ్యంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాల్లో నీటి వాడకాలపై ఆంధ్రప్రదేశ్‌ గట్టిగా పట్టుబట్టకుండా సైలెంటుగా వుండిపోయింది. ఇప్పుడు అదే ధోరణితో వుండాలని భావిస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రి లేఖకు ఎలా బదులివ్వాలనేది ఆలోచిస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. తెలంగాణ బాటలోనే నడవాలని జగన్‌ భావిస్తున్నారా అనేది కూడా ఇంతవరకు తెలియలేదు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైంది.

వాస్తవానికి 2016 సెప్టెంబరు 23న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన ఏ ఒక్క సమస్యా నిజానికి ఇప్పటి వరకూ పరిష్కారం కాలేదు. ఇప్పుడు జరగబోయే సమావేశంలో ఆ అంశాలే ఎజెండాగా పెట్టి ఏపీ తరుఫున గట్టిగా మాట్లాడాల్సివుంది. ఇది చట్టబద్దంగా ఏపీకి లభించిన మంచి అవకాశం. జగన్ ఒకవేళ కేసీఆర్ ట్రాప్‌లో పడి ఈ అవకాశాన్ని వదులుకుంటే రేపు పరిష్కారం కాని వివాదాల గురించి ఏ ట్రిబ్యునల్‌కు పోలేని పరిస్థితి. కేంద్రాన్ని అసలే అడగలేని స్థితి.

అందుకే ఈ సమావేశానికి హాజరైతే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పరిష్కారం కాని పాత అంశాలనే కొత్త ఎజెంగా అంశాలుగా పంపి జలశక్తి శాఖ ముందు పెట్టి సామరస్యంగానే పరిష్కరించుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. జగన్‌ అభీష్టం ఏంటనేది తెలియకపోవడం వల్ల కింది స్థాయిలో అధికారులు కూడా ఎజెండా అసలు రూపొందించాలా వద్దా అనేది తేల్చుకోలేకపోతున్నారు. జగన్ ఈ మీటింగే వద్దని అనుకుంటే, ఏపీకి కచ్చితంగా నష్టం జరిగినట్టేనని జలవనరుల శాఖలో పనిచేసిన విశ్రాంత అధికారులు చెబుతున్నారు. ఎజెండా వద్దని ఒకవేళ జగన్ నిర్ణయం తీసుకుంటే అదే విషయాన్ని ప్రభుత్వాభిప్రాయంగా కేంద్రానికి పంపుతారు. అప్పుడు కేంద్రం రెండు రాష్ట్రాలపై కచ్చితంగా ఫోకస్ పెడుతుంది. మున్ముందు ఎలాంటి వివాదాలు తలెత్తినా జోక్యం చేసుకోకుండా గుంభనంగా వుంటే అప్పుడు జరిగే నష్టం ఏపీకేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంతకుముందు జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఎటువంటి నిర్ణయాలు అమలుకు నోచుకోలేదు. ఏపీ అభ్యంతరాలపై ఇంతవరకు కేంద్రం కానీ, తెలంగాణ కానీ నిర్ణయాలు తీసుకోలేదు.  కృష్ణా నదీ జలాల పంపకాల సమస్య అలానే వుంది. మరోపక్క మెఘా నిర్మాణ సంస్థలకు మేళ్లు చేస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతోంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఏ ఒక్క సాగు నీటి ప్రాజెక్టుకూ కౌన్సిల్‌ ఆమోదం లేదు. ఏపీ అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకోలేదు. పైగా ఏపీ అనుమతి లేని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హాజరయ్యారు. దిగువ రాష్ట్రానికి నీటి కేటాయింపులు లేకుండా ఎగువ రాష్ట్రంలో ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు నిర్మించినా కచ్చితంగా అది అక్రమమే అవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోందదని హెచ్చరిస్తున్నారు.

ఉభయ రాష్ట్రాలూ సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుంటే ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే అవసరం లేదన్నది వాస్తవమే. ఆ పేరుతో ఏపీకి దక్కాల్సిన వాటా దక్కకుండా చేయడం, దిగువ రాష్ట్రం హక్కుగా వున్న నదీ ప్రవాహాన్ని అడ్దుకోవాలని చూడటం కూడా భావ్యం కాదు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుపై తాము వేసిన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని కేసీఆర్‌ ఎన్నికల ముందు ప్రకటించారు. ఇప్పటివరకూ ఆ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోలేదు. మరి అలాంటి మనిషిని ఎలా నమ్మి ముందుకు వెళ్తారని ఏపీ ముఖ్యమంత్రికి స్థానికంగా వుండే జలవనరుల శాఖ నిపుణులు గుర్తు చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాలపై, ఎత్తుపై కూడా ఇటీవల జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

ఇలాంటి వివాదాలపై థర్డ్‌ పార్టీ చెక్‌ ఉండేందుకు రేపు జరగబోయే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ తప్పుకుండా ఏపీకి ఉపయోగపడుతుంది. అలాంటి మంచి అవకాశాన్ని జగన్ వదులుకుంటే అది భావితరాలను మోసం చేయడమేనని అంటున్నారు. అపెక్స్ కౌన్సిల్ ఉనికినే సవాల్ చేస్తున్న కేసీఆర్ వాదనే తప్పు అని చెబుతున్నారు. పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన ఈ కౌన్సిలే అవసరం లేనప్పుడు కృష్ణా, గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డులతోనూ అవసరం ఏముంటుందని, అన్నింటినీ ఉత్సవ విగ్రహాలుగా మార్చి తెలంగాణాకు ప్రయోజనాలు దక్కేలా కేసీఆర్ వేసిన ఎత్తుగడలో చిక్కి రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టవద్దని కోరుతున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp