నరేంద్ర మోడీ.. 2014కు ముందు బీజేపీ సర్కిల్ లో, గుజరాత్ కు పరిమితమైన ఈ పేరు ఇప్పుడు యావత్ ప్రపంచమంతా మార్మోగుతోంది. దీని వెనుక సవాళ్లు ఎన్నో. వాటన్నింటినీ దాటుకుంటూ ఆయన ఈ స్థాయిలో నిలబడ్డారు. అయితే.. ఈ మధ్యే 20 ఏళ్లపాటు వరుసగా అధికారం చేపట్టిన లీడర్ గా మోడీ రికార్డ్ సృష్టించారు. ఈ నేపథ్యంలోనే సీఎంగా, ప్రధానిగా ఆయన చేసిన సేవలను వివరిస్తూ.. మోడీ @ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే పుస్తకం విడుదలైంది.
మోడీ రాజకీయ జీవితం, పరిపాలనపై రాసిన ఈ పుస్తకాన్ని భగవద్గీతతో పోల్చారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. రాజస్థాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. మోడీ @ 20: డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకం గురించి ప్రస్తావించారు. ‘శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత గ్రంథం ఎలాగో.. భవిష్యత్తు తరాలకు ఈ పుస్తకం కూడా అలాగే అని కచ్చితంగా చెప్పగలను’ అని అన్నారు.
20 ఏళ్ల పాటు ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుకు సంబంధించిన పలు అంశాలపై 22 మంది నిపుణులు రాసిన 21 కథనాల సంకలనం ఈ పుస్తకం. మే 11న న్యూఢిల్లీలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీన్ని ఆవిష్కరించారు. ప్రజా పోరాటాలపై లోతైన అవగాహన, కలలుగనే ధైర్యం, కృషి, అభిరుచి, శక్తి, దృఢ నిశ్చయం ప్రధాని మోడీ విజయ రహస్యాలని ఆనాడు వెంకయ్య కొనియాడారు.
ఈ పుస్తకంపై షెకావత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. షెకావత్ కామెంట్స్ పై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ నేతలకు జ్ఙానం ప్రసాదించాలని ఎద్దేవ చేసింది.