200 రూపాయల విలువైన మందులు కొని కేవలం రూ.21 ఫోన్ పే చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన జన ఔషధి దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు వైద్యం, ఔషధాల ఖర్చు తగ్గించడమే ప్రధాన మంత్రి జనఔషధీ పథకం లక్ష్యమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అధిక సేల్స్ చేసిన వారికి కిషన్ రెడ్డి అవార్డులను అందజేశారు. 2017లో 3 వేల జనఔషధీ కేంద్రాలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 9,177కు చేరిందన్నారు. జన ఔషధి ‘సేవా భి, రోజ్ గార్ భీ’ నినాదంతో కేంద్రం ముందుకెళ్తోందని తెలిపారు. జన ఔషధి సుగమ్ మొబైల్ యాప్ ద్వారా కేంద్రాలు, మందుల రేట్లు తెలుసుకోవచ్చన్నారు.
మెడికల్ షాపుల్లో దొరికే రేట్ల కంటే.. జనఔషధి కేంద్రాల్లో 50 నుంచి 90 శాతం తక్కువ ధరకే మందులు లభిస్తాయన్నారు కిషన్ రెడ్డి. కరోనా సమయంలో జనఔషధి కేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు.
జనఔషధి కేంద్రాల నిర్వాహకులకు ప్రోత్సాహకం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు కేంద్రం పెంచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం జనరిక్ మెడికల్ షాపుల్లో 1700 రకాల మందులు ఉన్నాయని, ఈ సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.