బీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. పంచాయతీలకు కేటాయించిన కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీ ద్వారా గంటలోనే పక్కదారి మళ్లించిందని దుయ్యబట్టారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ విషయంపై తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్థ ఆర్ధిక విధానాల కారణంగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు యధేచ్ఛగా వనరుల దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. లీటర్ పెట్రోల్ కు అదనంగా రూ.13 రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. పెట్రోల్ ధరలపై బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేయడం సరికాదన్నారు.
డీజిల్ పై 22 శాతం వ్యాట్ ఉంటే తెలంగాణలో 27 శాతానికి పెంచారన్నారు. ఆయిల్ కంపెనీలు నష్టాలు వచ్చినా ధరలు పెంచలేదని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పెట్రో ఉత్పత్తులు పెరిగినా సామాన్యులపై భారం వేయకుండా ప్రధాని మోడీ పటిష్ట చర్యలు తీసుకున్నారని వెల్లడించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.