అంబర్ పేట్ లో ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతి చెందిన బాలుడు ప్రదీప్ కుటుంబాన్ని పరామర్శించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సోమవారం అంబర్ పేట్ లోని ప్రదీప్ ఇంటికెళ్లిన కిషన్ రెడ్డి.. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ఈ సందర్బంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతే కాకుండా మృతి చెందిన బాలుడి అక్క మేఘన చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానన్నారు.
అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహించారు. కుక్కల దాడిలో ప్రదీప్ చనిపోవడం దురదృష్టకరం, అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. అంబర్ పేట్ లో వీధి కుక్కలు పెరగడానికి కారణం సర్కార్ నిర్లక్ష్యమే అని ఆరోపించారు.
సంతాన నియంత్రణ ఆపరేషన్ల పేరుతో కుక్కలను అంబర్ పేట్ కు తీసుకొస్తున్నారని.. ఆ తర్వాత ఇక్కడే కుక్కలను వదిలేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ కారణంగానే అంబర్ పేట్ లో కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.
కుక్కలను పట్టుకుని.. వాటిని ఒకచోట పెట్టాలని, వాటికి ఏం ఆహారం అందిస్తారు, బడ్జెట్ ఎంత కేటాయిస్తారో నగర పాలక సంస్థ అధికారులు చెప్పాలన్నారు. వీధి కుక్కల సమస్య పరిష్కారానికి పోరాటం చేయాలన్నారు. హైదరాబాద్ ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.