తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గురువారం క్లాసిక్ గార్డెన్స్ లో బీజేపీ హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
దళిత ముఖ్యమంత్రి, దళితబంధు ఎక్కడ? అని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబం చేయని అవినీతి లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. కేసీఆర్, ప్రధాని మోడీని గద్దె దించడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడని ఆరోపించారు. ఆ డబ్బు ఎవరిదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. కర్ణాటకలో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ మూడు రోజుల సమయం తీసుకుందంటూ సెటైర్లు వేశారు.
వీళ్లు దేశంలో అన్ని పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారంలోకి వస్తారట.. దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చినా మూడు నెలల కంటే ఎక్కువ పాలించలేవని చమత్కారం చేశారు. బీజేపీ మాత్రమే సమర్థవంతమైన పాలన అందిస్తుందని స్పష్టం చేశారు. మోడీ ఏ దేశానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.