సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులను, దేశాన్ని అవమానించడం సీఎం కేసీఆర్‌కు అలవాటై పోయిందని ఆయన మండిపడ్డారు. సీఎం హోదాలో ఉండి కూడా దేశాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు.
కావాలంటే బీజేపీని రాజకీయంగా విమర్శించండన్నారు. అంతే కాని దేశాన్ని మాత్రం విమర్శించకూడదంటూ ఆయన సూచించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి దావత్‌లు చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. కానీ కృష్ణ జలాల వివాదంపై మాత్రం కూర్చోని చర్చించరని విమర్శించారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చర్చిస్తే సమస్య ఎందుకు పరిష్కారం కాదని ఆయన ప్రశ్నించారు. జల వివాదాలపై మీటింగ్ పెడితే సీఎం కేసీఆర్ రారు కానీ బీజేపీపై మాత్రం ఆరోపణలు చేస్తారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కుటుంబ సభ్యుల కోసమే కేసీఆర్ అంతరాత్మ కొట్లాడుతోందన్నారు.
బయటివాళ్ల గురించి కేసీఆర్ అంతరాత్మ అసలు పట్టించుకోదని ఆయన ఎద్దేవా చేశారు. అధికారం పోకూడదని, కొడుకు సీఎం కావాలని సీఎం కేసీఆర్ అంతరాత్మ కోరుకుంటుందని ఆయన అన్నారు. 9 ఏండ్లుగా తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తూనే ఉన్నారని ఆయన ఆరోపించారు.