సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కేసీఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ పేరిట కొత్త నాటకలను ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. దురుద్దేశంతో స్థాపించిన ఏర్పాటు కూడా ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు మనుగడ సాధించలేదన్నారు.
బీజేపీని గద్దె దించుతామంటూ కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఆయన్ని విపక్షాల నేతలెవరూ నమ్మడం లేదన్నారు. టీఆర్ఎస్‌కు మిగిలిన ఏకైక మిత్ర పక్షం మజ్లిస్ మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెబుతున్న జాతీయ పార్టీ ఎవరి కోసమనే విషయం తెలియక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారని అన్నారు.
ఆయన ఎన్ని నాటకాలాడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మజ్లిస్‌ను బలోపేతం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతున్నారని పేర్కొన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంధకారంలోకి పోతోందన్నారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందన్నారు.
జాతీయ పార్టీపై తప్ప టీఆర్ఎస్ వైఫల్యాలపై చర్చ జరగొద్దన్నదే కేసీఆర్ ఆలోచన అని మండిపడ్డారు. దేశ ప్రధాని కావాలంటూ కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కలలు కంటున్నారన్నారు. కవిత కేంద్రమంత్రి, కేటీఆర్ తెలంగాణ సీఎం అయినట్లు వాళ్లంతా కలలు కంటున్నట్టు పేర్కొన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చెప్పారు. ఐఏఎస్ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నాట్టు ఆరోపించారు. పార్లమెంటులో టీఆర్ఎస్‌కు ఎనిమిది సీట్లతో దేశంలో ఇప్పుడు ఎలా చక్రం తిప్పుతారు?’ అని ఆయన ప్రశ్నించారు.