తెలంగాణలో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఆదివారం ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించామన్నారు. మొదటగా ఖమ్మం, సిరిసిల్ల, జనగామలో స్టార్ట్ చేశామన్నారు. రానున్న రోజుల్లో అన్ని బ్యాంక్ లలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను తీసుకువస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే క్రెడిట్ కార్డు ఉండేది.. కానీ ఇప్పుడు పేదలందరూ ఈ కార్డ్ ని ఉపయోగించుకుంటున్నారన్నారు.
ప్రస్తుతం డిజిటల్ బ్యాంకింగ్ కు చాలా ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. రేషన్ కార్డుల మాఫీయాను అరికట్టి.. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు అందించామన్నారు. డ్యూప్లికేట్ ఎల్ పీజీ అకౌంట్లకు చెక్ పెట్టేందుకు డిజిటల్ బ్యాంకింగ్ సహకారం అందించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బ్యాంకులో 300 కోట్లను డిజిటల్ పద్దతిలో అందిస్తామని ఆయన వెల్లడించారు. త్వరలో మూడు వందల కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్ధుల స్కాలర్ షిప్ లను డిజిటల్ బ్యాంకు అకౌంట్ల ద్వారా బదిలీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
డిజిటల్ బ్యాంకుల ద్వారా భవిష్యత్ లో స్టూడెంట్స్ కు ఒన్ క్లాన్.. ఒన్ టీవీ పేరుతో విద్యా భోదన చేయనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే 50 కోట్ల అకౌంట్లను జన్ ధన్ అకౌంట్ కింద ఓపెన్ చేశామని, తెలంగాణలో జన్ ధన్ అకౌంట్లు కోటి ఉన్నాయన్నారు. గతంలో ధనికులకే బ్యాంకులు ఉపయోగపడేవి. ఇప్పుడు పేదలకు కూడా ఉపయోగపడుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన వారే.. ఇప్పుడు అభినందిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలే కాదు.. త్వరలోనే డిజిటల్ రంగంలోకి విద్యా భోదనను కూడా తీసుకువస్తామని ఆయన చెప్పారు. భారత దేశంలో డిజిటల్ విప్లవం వస్తుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్య్రక్రమంలో జనగాం శాసనసభ్యులు ముత్రెడ్డి యాదగిరి రెడ్డి, డిజిటల్ బ్యాంక్ హైదరాబాదు వింగ్ అధికారులు అమిత్, అశ్విన్ కుమార్ మెహత, తదితరులు పాల్గొన్నారు.