కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ మెప్పుకోసం టీఆర్ఎస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని.. ప్రజలే చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ.. అన్నింటినీ అధిగమించి రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తే.. ప్రజలకు చేరనివ్వలేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి పదవి చెప్పుతో సమానమని మాట్లాడిన కేసీఆర్ కు పదవిలో ఉండే అర్హత లేదని.. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని విరుచుకుపడ్డారు. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్.. సీఎం పదవికి అనర్హుడన్నారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని రాష్ట్ర ప్రభుత్వమని మండిపడ్డారు కిషన్ రెడ్డి.
రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. మోడీ ప్రధాని అయ్యాక వరంగల్ సిటీకి అధిక ప్రాధాన్యమిచ్చారన్న ఆయన.. ఈ క్రమంలోనే వరంగల్ ను హెరిటేజ్ సిటీగా ప్రకటించామన్నారు. వేయి స్తంభాల గుడి అభివృద్ధిలో భాగంగా రూ.15 కోట్ల ఖర్చుతో కల్యాణ మండప పునఃర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రూ.50 కోట్లకు పైగా నిధులతో రామప్పను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం భూమి కావాలని ఎన్ని సార్లు చెప్పినా.. రాష్ట్ర సర్కారు పట్టించుకోవడంలేదని తెలిపారు. భద్రాచలం టెంపుల్ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. డీపీఆర్ రాగానే పనులు చేపడుతామని చెప్పారు. జోగులాంబ టెంపుల్ కోసం రూ.33 కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. ములుగులో ట్రైబల్ సర్క్యూట్ ను అభివృద్ధి చేస్తామని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.