ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం చేయడానికి సిద్దంగా ఉంటే.. అందుకు బీజేపీ కూడా అదే తరహాలో ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ కార్పోరేటర్ లు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మరో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే హజరయ్యారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పని చేయడం లేదన్నారు. బీజేపీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ కు త్వరలోనే గౌరవంగానే సమాధానం చెప్తామని వ్యాఖ్యానించారు మంత్రి. ఎవరికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అన్ని విషయాలపై త్వరలోనే డీటెయిల్ గా మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో అన్ని మ్యూజియంలను అభివృద్ధి చేస్తామన్నారు. కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సెంట్రల్ విస్టాలో నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ లలో కొత్త మ్యూజియాలను ఏర్పాటు చేస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్ చరిత్ర, బిర్సా ముండా చరిత్ర పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నెల 15, 16 తేదీల్లో అంతర్జాతీయ మ్యూజియం సదస్సును.. హైదరాబాద్ వేదికగా సాలార్ జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
రూ.15 కోట్లతో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా రాష్ట్రానికి రూ. కోటి కేటాయించామని తెలిపారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్థలాన్ని కేటాయించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. వెంటనే మ్యూజియం ఏర్పాటుకు కావల్సిన స్థలాన్ని ఏర్పటు చేయాలన్నారు. కేంద్రాన్ని ప్రతిసక్షాలను విమర్శించే ముందు రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పితే బాగుంటుందన్నారు.