బీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెబితే హుందాగా ఉంటుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం మానుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగిస్తూనే.. బీజేపీపై బురద జల్లడం దారుణమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వడగళ్ల వానలు, ఈదురు గాలులకు కోతకొచ్చిన పంటలు దెబ్బతినడం చాలా విచారకరమన్నారు.
ఇలా నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలదేనని తెలిపారు. ఈ ప్రకృతి వైపరిత్యాలనే దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’ పథకాన్ని ప్రవేశ పెట్టారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దీని వలన నష్టపోయిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించడం జరుగుతుందన్నారు తెలిపారు.
అయితే మొదట్లో ఈ పథకంలో చేరిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ తర్వాత కారణాలేమీ చెప్పకుండా ఈ స్కీమ్ నుంచి వైదొలిగిందని చెప్పారు. కేవలం రాజకీయ కారణాలతోనే ఫసల్ బీమా యోజన నుంచి కేసీఆర్ సర్కార్ వైదొలిగిందన్నారు కిషన్ రెడ్డి. ఇటీవల పంటలు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్.. రైతులకు పరిహారాన్ని ప్రకటించే క్రమంలో కేంద్రంపై నిందలు మోపడం దురదృష్టకరమని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ ఎస్డీఆర్ఎఫ్ నుంచి రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పారు.. వాస్తవానికి ఎస్డీఆర్ఎఫ్ లో 75 శాతం నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని పేర్కొన్నారు. 2014-15 నుంచి ఇప్పటివరకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ లు కలిపి రాష్ట్రానికి రూ.3,06,987 కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేయడం మానుకొని.. ప్రజల ముందు వాస్తవాలను చెబితే హుందాగా ఉంటుందని సూచించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.