ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యేలు, ఎంపీలనే కాదు చివరకు గవర్నర్లు, ప్రధాని, రాష్ట్రపతిని కూడా గౌరవించడం రాదని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ముందు ఆయన పార్లమెంట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగాన్ని గౌరవించడం చేతకాని కేసీఆర్.. పదేపదే ప్రజాస్వామ్య వ్యవస్థలను అవమాన పరుస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ లో రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయాలంటూ బీఆర్ఎస్ ఎంపీలకు.. కేసీఆర్ పిలుపునివ్వడం రాజ్యాంగానికి, రాజ్యాంగబద్ధ సంస్థలకు, రాజ్యాంగ బద్ధ పదవులకు వారిచ్చే గౌరవానికి నిదర్శనమని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటెలను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా సస్పెండ్ చేస్తున్న మీరా నాకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు. ప్రతీసారి రాజీనామాలకు సిద్ధమని చెప్పే బీఆర్ఎస్ నాయకులను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
మరో 3-4 నెలల్లో ఎన్నికలు రాగానే మీరు రాజీనామా చేసే పని లేకుండానే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.