కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేశాయి. వాటిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. శుక్రవారం జరిగిన లోకసభ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశం అంధకారంలో ఉందన్నారు. అవినీతి, రెండు అంకెల ద్రవ్యోల్బణం సహా ఆర్థిక వ్యవస్థను దిగజార్చే అన్ని అంశాలు కాంగ్రెస్ హయాంలో రాజ్యమేలాయని విమర్శించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పరిస్థితులు మారాయన్నారు నిర్మలా. ప్రస్తుతం దేశం ఆర్థికంగా పుంజుకుంటోందని తెలిపారు. 2020-21 సంవత్సరంలో దేశంలో 1 బిలియన్ డాలర్ విలువ చేరుకున్న 42 స్టార్టప్ లను గుర్తించామని మంత్రి వెల్లడించారు. దేశంలో అమృతకాలానికి ఇదే నిదర్శనమన్నారు.
2020-2021 మధ్య 44.58 జనధన్ ఖాతాల్లో రూ.1.57 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎంఎస్ఎమ్ఈ లకు రూ.2.36 లక్షల కోట్ల సాయం అందించినట్లు తెలిపారు.
పీఎం ముద్ర యోజన పథకం కింద ఇప్పటివరకు 1.2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం కూడా బాగా తగ్గిందన్నారు. కరోనా మహమ్మారి ప్రజలను కభలించిందన్నారు కేంద్ర మంత్రి నిర్యలా.