కేంద్ర మంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీకి మళ్ళీ బెదిరింపు కాల్స్ అందాయి. రూ. 10 కోట్లు ఇవ్వాలని, లేని పక్షంలో మీకు హాని తలపెడతామని బెదిరిస్తూ నాగపూర్ లోని ఆయన ఇంటికి, కార్యాలయానికి మంగళవారం మూడు కాల్స్ అందాయి. కాల్ చేసిన వ్యక్తి తనను జయేష్ పూజారి అలియాస్ జయేష్ కాంతాగా చెప్పుకున్నాడు. అయితే ఈ కాల్ తాను చేయలేదని ప్రస్తుతం కర్ణాటక బెళగావి లోని హిందల్గా జైల్లో శిక్ష అనుభవిస్తున్న జయేష్ పూజారి చెప్పాడు. ఓ హత్య కేసులో ఇతనికి మరణశిక్ష పడింది. గత జనవరిలో కూడా ఇదే వ్యక్తి ఇలాంటి కాల్స్ చేసిన విషయాన్నీ పోలీసులు గుర్తు చేశారు.
మంగళవారం ఉదయం రెండు సార్లు, మధ్యాహ్నం ఒకసారి నితిన్ గడ్కరీ ఇంటికి, ఆఫీసుకు కాల్స్ వచ్చినట్టు నాగపూర్ రెండో జోన్ డిప్యూటీ సీపీ రాహు మాడనే తెలిపారు. ఈ కాల్స్ తో నితిన్ ఇల్లు, ఆఫీసు వద్ద పోలీసు భద్రతను మరింత పెంచారు. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు కాల్ వచ్చిన నెంబర్ ను మంగుళూరు లోని ఓ మహిళకు చెందినదిగా గుర్తించారు.
ఈ కాల్ ఆ మహిళే చేసిందా లేక జయేష్ పూజారి ఆమె చేత చేయించాడా అన్నది తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఆ మహిళ మంగుళూరులో ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పని చేస్తోందని, ఆమెను తాము సంప్రదించామని చెప్పిన రాహు మడానే.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. తానేమీ మూడు కాల్స్ చేయలేదని జయేష్ పూజారి చెప్పడం, ఈ మహిళ గురించిన వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో పోలీసులు అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నారు.
గత జనవరి 14 న కూడా నితిన్ గడ్కరీకి ఇలాంటి కాల్స్ వచ్చాయి. తాను జయేష్ పూజారినని, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కి చెందినవాడినని, రూ. 100 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడట.