కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను వదిలేయాలన్న ఆలోచనలు తనకు అప్పుడప్పుడు వస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయాల కన్నా జీవితంలో చూడాల్సింది ఎంతో ఉందన్నారు.
నాగపూర్ లో సామాజిక కార్యకర్త గిరీశ్ గాంధీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాజకీయాలకు స్వస్తి పలకాలని తాను గతంలో చాలా సార్లు అనుకున్నానని చెప్పారు. కానీ అలా చేయలేకపోయానని ఆయన వాపోయారు.
రాజకీయాలంటే సామాజిక మార్పు అని ఆయన పేర్కొన్నారు. కానీ ఇప్పుడందరూ కేవలం అధికార దాహంతోనే రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో అధికారం కోసమే తాపత్రయపడుతున్నారని అన్నారు.
పాలిటిక్స్ అంటే కేవలం సామాజిక ఆర్థిక సంస్కరణ అని తెలిపారు. అందువల్ల నేటి రాజకీయ నేతలు విద్య, కళలు సంస్కరణ కోసం పనిచేయాలని సూచించారు. రాజకీయం అనే పదానికి అర్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలన్నారు. దాని అర్థం అది సమాజ, దేశ సంక్షేమం అని పేర్కొన్నారు.