లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కొన్ని షరతులతో ప్రజా రవాణాను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించగా, మే 15 తర్వాత దేశీయంగా విమానాలను నడిపే అంశాలపై ఆలోచిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
దేశంలో 45 రోజులుగా ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. ప్రయాణాలన్నీ రద్దయ్యాయి. ఇప్పటికే కేంద్రం కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజా రవాణా కూడా మొదలుపెట్టబోతున్నారు. మే 17 తర్వాత గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు, ట్రైన్స్ నడిచే అవకాశం ఉంది. ఎంత మేరకు నడుస్తాయన్న అంశంపై కొద్దిరోజుల్లోనే క్లారిటీ రాబోతుంది.
ఇక విదేశీ ప్రయాణంపై కొన్ని ఆంక్షలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ మే 15 తర్వాత దేశీయంగా విమానాలు నడిపే అంశంపై రివ్యూ చేస్తామని, తొలి దశలో 25శాతంతో మొదలుపెట్టి వాటి సంఖ్యను పెంచబోతున్నట్లు ఓ మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు. అయితే భౌతిక దూరం పాటించే అంశంతో పాటు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అన్నారు కేంద్రమంత్రి హర్ధీప్ సింగ్ పూరి.
ఆటో మొబైల్ రంగ నిపుణులతో కేంద్రమంత్రి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యక్తిగత శుభత్ర, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకొని ప్రజా రవాణాను మొదలుపెట్టే ఆలోచన ఉందని, అయితే దేశంలో బస్సులు, ట్రక్కుల బాడీల నాణ్యత లోపం కారణంగా 7 సంవత్సరాలకు మించి పనిచేయటం లేదన్నారు. ఐరోపా దేశాల్లో 15 సంవత్సరాల వరకు పనిచేస్తాయని తెలిపారు. ఇక చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది.