కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. నాగ్‌పూర్ లోని ఆయన కార్యాలయానికి దుండగులు మూడు సార్లు బెదిరింపు కాల్స్ చేశారు. ఉదయం 11:25, 11:32, 12.32 గంటలకు ఆ కాల్స్ వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న నాగ్ పూర్ పోలీసులు కేంద్ర మంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. ఆ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మంత్రిని దుండగులు కొన్ని డిమాండ్లు చేసినట్టు వెల్లడించారు. వాటిని తీర్చకపోతే మంత్రిని చంపేస్తామని బెదిరించారని నాగ్ పూర్ డీసీపీ రాహుల్ మదానే వివరించారు.
ఆ కాల్స్ చేసిన ఆగంతకులను గుర్తించేందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు ఆయన తెలిపారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో కేంద్ర మంత్రికి భద్రతను పెంచారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్ పూర్ లో ఉంటున్నారు. అక్కడ ఆయన మకర సంక్రాంతి వేడుకలు జరుపుకోనున్నారు.
నోయిడాలో కేంద్ర మంత్రి గడ్కరీ నిన్న ఉదయం ఆటో ఎక్స్పో 2023 ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన….భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ దారుగా అవతరించబోతోందని ఆయన చెప్పారు.