రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తోసిపుచ్చారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో మీడియాతో మాట్లాడుతూ..”రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ఉద్దేశం నాకు లేదు” అని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం గురించి మీడియా బాధ్యతయుతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ క్రమంలోనే మంత్రి ముంబై-గోవా హైవే నిర్మాణ పనులను ఏరియల్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ కూడా పాల్గొన్నారు. ముంబై-గోవా జాతీయ రహదారి నెం.66 నిర్మాణ పనులు డిసెంబర్ 2023 నాటికి పూర్తవుతాయని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. ముంబై- గోవా హైవేను 10 ప్యాకేజీలుగా విభజించినట్లు ఆయన తెలిపారు.
వీటిలో సింధుదుర్గ్ జిల్లాలో రెండు ప్యాకేజీలు దాదాపు 99 శాతం పూర్తయినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. రత్నగిరి జిల్లాలో మొత్తం ఐదు ప్యాకేజీలు ఉండగా వీటిలో రెండు ప్యాకేజీలువరుసగా 92 శాతం, 98 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఆలస్యమైన రెండు ప్యాకేజీల పనులను కొత్త కాంట్రాక్టర్‌ను నియమించి పున:ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు.
“రాయ్‌గఢ్ జిల్లాలోని మూడు ప్యాకేజీలలో, రెండు ప్యాకేజీలు వరుసగా 93 శాతం మరియు 82 శాతం వరకు పూర్తయ్యాయి. ప్యాకేజీలో సగానికి పైగా పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తాం ”అన్నారాయన. పన్వేల్-ఇందాపూర్ దశ కోసం భూసేకరణ, పర్యావరణ అనుమతులు ముంబై-గోవా జాతీయ రహదారి పనిని ఆలస్యం చేశాయని మంత్రి తెలిపారు.
ఇప్పుడు ఈ అడ్డంకులన్నీ తొలగిపోయాయని, కర్నాల అభయారణ్యం ప్రాంతంలోని ఫ్లైఓవర్‌ను తొలగించి పర్యావరణ సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ముంబై-గోవా జాతీయ రహదారి గోవాలో నిర్మాణ పనులు పూర్తయినట్లు మంత్రి తెలియజేశారు. ముంబై-గోవా జాతీయ రహదారి కొంకణ్‌లోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను కలిపే హైవే. ఇది పర్యాటక అభివృద్ధికి ఊతం ఇస్తుంది. అలాగే ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ రోడ్డు ఉన్నందున పారిశ్రామికాభివృద్ధి కూడా ఊపందుకుంటుందని మంత్రి తెలిపారు.
15 వేల కోట్లతో మూడు కొత్త ప్రాజెక్టులను మంత్రి ప్రకటించారు. వీటిలో ₹ 1,200 కోట్ల కలంబోలి జంక్షన్ ప్రాజెక్ట్, ₹ 1,200 కోట్లతో పగోడ్ జంక్షన్ చౌక్ నుండి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ మరియు ₹ 13,000 కోట్లతో JNPA ద్వారా ఢిల్లీని కలిపే మోర్బే – కరంజాడే హైవే ఉన్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం రాయగడ జిల్లా పలాస్పే గ్రామంలో ₹ 414.68 కోట్లతో 63,900 కి.మీ పొడవునా మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేశారు.