– ఒప్పందం ప్రకారమే కొనుగోళ్లు
– కేసీఆర్ ది తప్పుడు ప్రచారం..
– రా రైస్ పై ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదు
– పంజాబ్ లోనూ బియ్యమే సేకరిస్తున్నాం..
– స్పష్టం చేసిన పీయూష్ గోయల్
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ సర్కార్ ది డ్రామానా? కేంద్రం ముందు నుంచి చెబుతున్నా టీఆర్‌ఎస్ నాటకాలు ఆడుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది బీజేపీ వర్గాల నుంచి. ధాన్యం కొనుగోళ్లపై తాడోపేడో తేల్చుకుంటామని మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు కేసీఆర్. ఫ్లైట్ ఖర్చులు తప్ప.. ఎలాంటి ఉపయోగం ఉండదని వారు వెళ్లకముందే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చారు. రా రైస్ ఎంతైనా తీసుకుంటామని స్పష్టం చేశారు. అయినా వినకుండా.. మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపారు.
పార్లమెంట్ లో కేంద్రమంత్రి పీయూష్ తో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. అయితే.. ఆ భేటీ తర్వాత మీడియా ముందుకొచ్చిన పీయూష్ గోయల్ అసలు గుట్టంతా బయటపెట్టారు. కేసీఆర్ ది అంతా డ్రామా అని తేల్చేశారు. టీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని.. వారి అసత్యాలతో రాష్ట్ర రైతుల్ని ఇబ్బందుల్లో పెడుతున్నారని విమర్శించారు.
ధాన్యం కొనుగోళ్లలో ఏ రాష్ట్రంపైనా కేంద్రం వివక్ష చూపదన్నారు పీయూష్. పంజాబ్ కు అనుసరిస్తున్న విధానమే తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారమే ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం మేరకు కేంద్రం బియ్యాన్ని మాత్రమే సేకరిస్తుందిని చెప్పారు. పంజాబ్ నుంచి కూడా బియ్యాన్నే సేకరిస్తున్నామని.. నేరుగా ధాన్యాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాలు ముడి బియ్యం ఎంత ఇస్తాయో చెప్పాయన్నారు పీయూష్. ఎన్నిసార్లు అడిగినా కేసీఆర్ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ఫిబ్రవరి 22, మార్చి 8 తేదీల్లో సమావేశాలకు రావాలని కోరామని.. కానీ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరూ రాలేదని వివరించారు. కేసీఆర్ సర్కార్ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులను అడ్డం పెట్టుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాతలకు భ్రమలు కల్పిస్తూ కేంద్రంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైరయ్యారు. తెలంగాణ రైతులకు కేంద్రం బాసటగా ఉంటుందని స్పష్టం చేశారు పీయూష్ గోయల్.