తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో నెంబర్ వన్ గా ఎదిగే సామర్థ్యం తెలంగాణకు ఉందన్నారు. కానీ.. రాష్ట్రంలో దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
రూ.40వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా రూ.1.30 లక్షల కోట్లకు పెంచిందన్నారు పీయూష్. దేశ చరిత్రలో ఇంత భారీ స్థాయికి జల ప్రాజెక్టు వ్యయాన్ని పెంచడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులను కూడా కేసీఆర్ సర్కారు విస్మరించిందని విమర్శలు గుప్పించారు.
రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు దక్కుతాయనే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఫైరయ్యారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎందరో త్యాగాలు చేశారని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు పెరిగాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అవినీతి పాలన కొనసాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడింది కల్వకుంట్ల కుటుంబం కోసం కాదని చురకలంటించారు.
ఎనిమిదేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్నారు గోయల్. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాషాయ జెండా రెపరెపలాడిందన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే తరహా విజయాన్ని అందుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.