బండి సంజయ్ తన పాదయాత్రతో తెలంగాణ ప్రజల్లో చైతన్య జ్యోతిని వెలిగించారని అన్నారు కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల. సిరిసిల్ల జిల్లా అంకిరెడ్డిపల్లిలో ప్రజాసంగ్రామ యాత్రలో ఆయన పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందో తనకు తెలుసని.. 1998లో గుజరాత్ లోని తన నియోజకవర్గంలో పాదయాత్ర చేసినట్లు చెప్పారు. బండి సంజయ్ కల నెరవేర్చేందుకు ఆయనతో పాటు రాత్రి, పగలు నడుస్తున్న కార్యకర్తలను అభినందించారు.
29 రోజులుగా బండి పాదయాత్ర చేస్తున్నారని.. కార్యకర్తలంతా ఆయన వెన్నంటే ఉండి నడిపిస్తున్నారని అన్నారు రూపాల. దేశమంతా మోడీని ఏ విధంగా ప్రేమిస్తూ ఆశీర్వదిస్తున్నారో.. రాష్ట్రంలో సంజయ్ నేతృత్వంలో తెలంగాణ ప్రజల అండ, ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రజా సమస్యలు, కష్టాలు తెలుసుకునేందుకు ఎండ, వానను లెక్కచేయకుండా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోందని కొనియాడారు.
దేశంలో 80 కోట్ల మందికిపైగా కరోనా వాక్సిన్ ఇచ్చామన్న రూపాల.. ఈ దెబ్బతో ప్రధానిని విమర్శించే వాళ్ల అందరి నోళ్లు మూసుకుపోయాయని చెప్పారు. ఒక్కరోజులో 2 కోట్ల మందికిపైగా వాక్సిన్ వేసిన ఘనత సొంతం చేసుకున్నామన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. తెలంగాణ ప్రజలు బండి సంజయ్ కి సంపూర్ణ మద్దతిస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు పురుషోత్తం రూపాల.
Advertisements