సీఎం ఉద్ధవ్ థాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బెయిల్ వచ్చింది. రాయ్ గఢ్ లోని మహద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కేవలం కక్షపూరితంగానే తనను అరెస్ట్ చేశారని.. పైగా నోటీసులు కూడా ఏమీ ఇవ్వలేదని కోర్టుకు వివరించారు రాణే. వాదనలు విన్న అనంతరం కేంద్రమంత్రి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
శనివారం జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న నారాయణ్ రాణే.. తన ప్రసంగంలో సీఎం చెంప పగులగొట్టాలని అన్నారు. దీంతో శివసేన వర్గాలు భగ్గుమన్నాయి. ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే మంగళవారం రత్నగిరి పర్యటనలో భోజనం చేస్తున్న సమయంలో రాణేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా దొరకలేదు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మహద్ మెజిస్ట్రేట్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.