ప్రధాని మోడీకి, అదానీకి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని.. హిండెన్ బెర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కష్టాల్లో పడిందని, అదానీ అంశంపై మోడీ సమాధానం ఇవ్వాల్సిందేనంటూ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలు ఇండియాలో దుమారాన్ని సృష్టించాయి. పైగా మోడీ పాటిస్తున్న మౌనం వల్ల కేంద్రంపై ఆయన పట్టు బలహీనపడుతోందని కూడా సోరోస్ వ్యాఖ్యానించి, ‘మంట’ ను మరింత రాజేశారు.
ఇప్పటికే అదానీ-హిండెన్ బెర్గ్ వివాదంపై విపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని అటు పార్లమెంటు లోను, ఇటు బయట ఇరకాటానపెడుతున్న ఈ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడి దీన్ని భారత్ పై దాడిగా అభివర్ణించారు. సోరోస్ ను ఆర్ధిక యుద్ధ నేరస్థుడుగా ఆరోపించారు.
తాజాగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా సోరోస్ మీద నిప్పులు చెరిగారు. ‘ఆయనో ముసలి, ధనిక, ప్రమాదకరమైన వ్యక్తి’ అని కసిగా వ్యాఖ్యానించారు. తప్పుడు కథనాలతో దురుద్దేశపూరిత నిందలు వేయడం ద్వారా ఈ దేశ ప్రతిష్టను దెబ్బ తీయలేరన్నారు. సోరోస్ వంటివారు తమ సొంత ఆలోచనా దృష్టితోనే వ్యవహరిస్తారని, తమకిష్టమైన పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ఆ ఎన్నికలను పొగుడుతారని, దీనికి వ్యతిరేక ఫలితం వస్తే ప్రజాస్వామ్యంలో ఎన్నో లోపాలున్నాయని ఆరోపిస్తారని అన్నారు
న్యూయార్క్ లో కూచుని సోరోస్.. తన అభిప్రాయాలు ఈ ప్రపంచాన్ని శాసిస్తాయని ఇంకా భావిస్తున్నట్టు కనబడుతోందన్నారు. ఇంతకు మించి ఆయన సోరోస్ వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న జైశంకర్. మీడియాతో మాట్లాడుతూ .. గత మూడు దశాబ్దాల్లో భారత విదేశాంగ విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఒకప్పటి భారత ఫారిన్ పాలసీకి, ఇప్పటి పాలసీకి మధ్య ఎంతో తేడా ఉందన్నారు. .