ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ .. కిచిడీ చేశారంటే భారతీయులంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవాలసిందే.. ఈ ఇండియన్ డిష్ తయారీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయనకు ‘గురువు’ అయ్యారంటే అది మరో వండర్ ! జీ-20 కూటమికి ఇండియా అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చిన బిల్ గారు.. ‘ఎంపవర్ మెంట్ త్రూ పోషన్ అభియాన్’ అనే వెరైటీ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. పోషాకాహార విలువలున్న భారతీయ వంటకాల ప్రాశస్త్యాన్ని తెలియజేయడమే దీని ఉద్దేశం.
ఈ కేటగిరీలో కిచిడికి పెద్ద పీట వేశారు. అమెరికన్ అయిన బిల్ గేట్స్ అసలు ఇలాంటి డిష్ ని ఎప్పుడైనా తిని ఉంటేగా ? అందుకే సహజంగా వంటల్లో మహిళా మణుల చెయ్యే వేరన్నట్టు స్మృతి ఇరానీ ఆయనకు దీన్ని ఎలా తయారు చేయాలో చేసి చూపారు. ఇందులో ఉండే పోషక విలువల గురించి వివరించారు.
కిచిడీని ఇలా చేస్తారంటూ పక్కనే ఉన్న రైస్, ఆయిల్, కడాయి ..ఇతర స్పైసీ మసాలా దినుసులను బిల్ గేట్స్ చేతులతోనే వేయిస్తూ చూపించారు. ఎలా పోపు పెట్టాలో కూడా చూపారు. ఇక నేనూ స్వయంగా ట్రై చేస్తానంటూ బిల్ గేట్స్ స్వయంగా దినుసులు వేసి గరిటతో తిప్పారు. అంతా అయ్యాక ఈ డిష్ ని బౌల్ లోకి తీసుకుని టేస్ట్ చేసి.. వండర్ అన్నారు. ఈ వీడియోను స్మృతి ఇరానీ పోస్ట్ చేస్తూ.. సాఫ్ట్ వేర్ బాస్ కు కిచిడీ రుచి చూపించానని సరదాగా పేర్కొన్నారు.
పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశంలోని పలు రకాల వంటలను ప్రదర్శించినప్పుడు ఈ ‘కిచిడీ’ గారడీ అందర్నీఆకట్టుకుంది.