భార్య చనిపోయిన తర్వాత మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెస్తే చాలా మంది పురుషులు విముఖత వ్యక్తం చేస్తారు.ఈ శేషజీవితాన్ని ఒంటరిగానే లాగించేస్తానని తీర్మానించుకుంటారు.
కొంత మంది మళ్ళీపెళ్ళాడ్డానికి లోలోపల ఇష్టం ఉన్నా.. బైటకు వ్యక్తపరచకుండా అంతా మీఇష్టం అన్ని సమాజం మీదకి నెట్టేసి తాళికట్టడానికి రెడీ అవుతారు. బహుతక్కువ మంది మాత్రమే మళ్ళీ పెళ్ళి అనగానే ఎగిరిగంతేసి బాహాటంగా బరాత్ చేసుకుంటారు.
అదిగో నఖేద్ యాదవ్ ఆ కోవకు చెందిన వాడే.65 యేళ్ళ వయసులో కూడా 23 యేళ్ళ వయసున్న యువతిని పెళ్ళిచేసుకుని డీజే సాంగ్ కి డాన్సులు కూడా వేసాడు.తాను ఒక్కడే కాదు, తన ఆరుగురి కూతుళ్ళతో కలిసిమరీ స్టెప్పులేసాడు. ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో జరిగిందీ సంఘటన. జిల్లాలోని హుసైనాబాద్ పూరే చౌధరి గ్రామానికి చెందిన నఖేద్ యాదవ్కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వారి వివాహ బంధానికి గుర్తుగా ఆరుగురు కుమార్తెలు జన్మించారు. ఆ తర్వాత అతడి భార్య చనిపోయింది.
కష్టపడి కుమార్తెలను పెంచి పెళ్లిళ్లు చేశాడు. అప్పటి నుంచి నఖేద్ ఒంటరి జీవితం గడుపుతున్నాడు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒంటరితనం నుంచి బయటపడేందుకు రెండో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాడు.
కుటుంబసభ్యుల అంగీకారంతో రుదౌలీ ప్రాంతంలో కామాఖ్యదేవి ఆలయంలో 23 ఏళ్ల యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. పెళ్లి తర్వాత బరాత్ కూడా ఘనంగా నిర్వహించారు.
ఆ సమయంలో నఖేద్ ఆరుగురు కుమార్తెలు, బంధువులు హుషారుగా నృత్యాలు చేశారు. 65 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకుగా మారిన నఖేద్ కూడా జోరుగా డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం వీరి డ్యాన్స్కు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.